గాయంతో కొంతకాలంగా క్రికెట్కు దూరమైన సూర్య కుమార్ యాదవ్ తిరిగి గ్రౌండ్లోకి దిగనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు అతనికి NCA నుంచి NOC జారీ అయింది. దీంతో రేపు ముంబై ఇండియన్స్ జట్టులో అతను చేరనున్నట్లు క్రిక్ బజ్ పేర్కొంది. నెట్ సెషన్లో అతడి ఆటను ముంబై మేనేజ్మెంట్ పరిశీలించనుంది. ఈనెల 7న ఢిల్లీతో జరగనున్న మ్యాచులో సూర్యను ఆడించాలా లేదా అనేది అతడి ఫిట్నెస్ను బట్టి నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ రాకతోనైనా గాడిలో పడుతుందేమో చూడాలి మరి.
కాగా, స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్న అతడు జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం NCA వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా, ఐపీఎల్లో 139 మ్యాచులు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 3249 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా సంవత్సరాలుగా ముంబైకి ఆడుతున్న సంగతి తెలిసిందే.