సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాల్పులు ప్రభావానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది.
ఉదయం 9 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 44.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు 44.5 డిగ్రీలు, నల్గొండ జిల్లా నాంపల్లి 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ ప్రథమార్థంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, ఈ మాసం చివరితో పాటు మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.