ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో బీసీ అభ్యర్థి..??

-

ఖమ్మం కాంగ్రెస్ లో టికెట్ హిట్ పెరుగుతుంది.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.. మరోపక్క సీనియర్ నేతలు సైతం టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు.. సీనియర్లను పక్కనపెట్టి మంత్రుల కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ కేటాయిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట.. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా పక్క పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించారని, పార్టీ బలోపేతానికి పనిచేసిన సీనియర్లకు టిక్కెట్ ఇవ్వలేదంటూ ఓవర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది. మంత్రుల కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా పాతతరం కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారం ఖమ్మం పార్లమెంట్లో వినిపిస్తోంది..

తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైన ఓటర్లు కలిగిన ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు ఎప్పుడూ హాట్ సీట్ లాంటిదే. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉద్దండులు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీటు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందిని రంగంలోకి దింపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోపక్క ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడి కోసం ఖమ్మం టికెట్ అడుగుతున్నారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఖమ్మం విషయంలో మాత్రం ఆచితూచి అడుగేస్తోంది.. మంత్రుల కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇస్తే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నారట. మంత్రి పదవులు అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వడం సరికాదని, సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం పెద్దలు పాతతరం నేతలకు చెబుతున్నారట. ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంతకాలం ఆలస్యం కావడానికి ఇదే కారణమని పార్టీలో చర్చ నడుస్తోంది

రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఖమ్మం ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందట. ఈ సెగ్మెంట్ నుంచి ఓసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రాతినిధ్యం దక్కిందని, తమను మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదంటూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా అందులో దాదాపు తొమ్మిది లక్షలు బిసి ఓటర్లు ఉన్నారు. ఈ సమీకరణాల నేపథ్యంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తుందని పార్టీలో చర్చ నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news