తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఎలాగైనా డబుల్ డిజిట్ సీట్లను సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో వారంతా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీరియస్ అయ్యారు. ఇదంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రేనని, ఇక్కడ తన గెలుపు ఖాయం అని తెలిసే తన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్ సెగ్మెంట్ లో విజయం సాధించి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి సమిష్టిగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఆంజనేయస్వామి మాలలో ఉన్న జర్నలిస్ట్ పై ధర్మపురి అర్వింద్ తన అహంకారాన్ని, కోపాన్ని ప్రదర్శించారంటూ ఇటీవల కొంతమంది సోషల్ మీడియాలో ఓ వీడియోను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోను చూపిస్తూ తాను హిందూ వ్యతిరేకి.. అంటూ ప్రచారం చేశారు. అయితే ఇదంతా నా గెలుపు ఖాయమనే అక్కసుతో కావాలనే చేస్తున్నారని అర్వింద్ ఖండించారు.