ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయనుందన్న వార్తలు పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పాయి. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొనడంతో కలకలం రేపుతోంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి ఇరాన్ పగతో రగిలిపోతున్న విషయం తెలిసిందే.
ఆ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఏడుగురు జనరళ్లు మృతి చెందగా.. అప్పటి నుంచి ఆ దేశ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే అమెరికా కూడా రంగంలోకి దిగుతుందని భావిస్తున్న ఇరాన్ టెల్ అవీవ్‌కు అండగా నిలిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించినట్లు సమాచారం.