దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు పర్యటకం రూపంలో భారత్ గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్‌పై తీవ్ర విమర్శలు చేసి అపకీర్తి మూటగట్టుకున్న మాల్దీవులకు పర్యటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్.. ప్రస్తుతం ఆరో స్థానానికి చేరింది. దీంతో పర్యాటకం భారీ స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామాలతో కుదేలైన అక్కడి పర్యటక సంస్థలు.. భారతీయులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
భారత్‌లోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య ప్రయాణ, పర్యటక సహకారాన్ని పెంపొందించడంపై ‘మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్’ ప్రతినిధులు మాలేలో భారత హైకమిషనర్‌తో ఈ మేరకు చర్చలు జరిపారు. మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్ అని, ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.