సోషల్ మీడియా పుకార్లకు జగన్ బ్రేక్‌..!

-

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మరో 30 రోజుల్లోనే ఏపీలో పోలింగ్‌ తేదీ. మరో వారం రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను దాదాపు ప్రకటించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం విడతల వారీగా అభ్యర్థులను ఖరారు చేయగా… వైసీపీ మాత్రం ఒక్క అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి మినహా… మిగిలిన అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసేసింది.

అయితే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టికెట్‌ దక్కని కొందరు అసంతృప్త నేతలు పార్టీలు మారుతున్నారు. అలాగే కొందరు అభ్యర్థుల తీరుపై కూడా స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థులు సరిగ్గా తిరగటం లేదని… ప్రచారంలో పాల్గొనటం లేదని…. అసలు అభ్యర్థే కనిపించటం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తామనే హామీని ఆయా పార్టీల అధినేతలు ఇస్తున్నారని.. అందుకే వారంతా పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మారుస్తారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.

గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి కిలారు రోశయ్య పేరును వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఆయన సరిగ్గా తిరగటం లేదని… అసలు గుంటూరులో రోశయ్య ప్రచారం చేయడం లేదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి విడదల రజినీని కూడా మారుస్తారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ తెగ వైరల్ అయ్యింది. గుంటూరు వెస్ట్‌ అనేది టీడీపీ కంచుకోట అని… అందుకని అక్కడ నుంచి రజినీని తప్పిస్తారనే మాట వినిపించింది.

రోశయ్యను అసెంబ్లీకి, రజినీని పార్లమెంట్‌కు పంపిస్తారంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌ అయ్యింది కూడా. అయితే తాజాగా ఏటుకూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఈ పుకార్లకు జగన్ చెక్‌ పెట్టారు. గుంటూరు పార్లమెంట్‌ నుంచి రోశయ్య, గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం నుంచి విడదల రజినీ పోటీ చేస్తున్నట్లు తేల్చి చెప్పేశారు. వారిద్దరిని గెలిపించాలంటూ జగన్‌ పిలుపునిచ్చారు కూడా. జగన్ ప్రసంగంతో సోషల్‌ మీడియా పుకార్లకు బ్రేక్‌ పడినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news