మరో 10 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఛత్తీస్‌గఢ్ లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఎదురు కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయినట్లు తెలిపారు. ఘటనాస్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో ఎదురుకాల్పులు జరిగాయిని చెప్పారు. ఇప్పటికీ కాంకేర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
కాంకేర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఓటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.