దేశంలో ఉల్లి ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో ఉల్లి పంటలు పూర్తిగా పాడైపోయాయి. దేశంలో కొన్ని చోట్ల 250 వరకు కూడా ఉల్లి ధర పలుకుతుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ధరలకు భయపడి… 5 కేజీలు కొనుగోలు చేసే వారు కేజీ… కేజీ కొనే వారు పావు కేజీ… అసలు కొన్ని చోట్ల అయితే ఉల్లి వాడకమే మానేశారు. దేశం మొత్తం దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్ర౦ భావిస్తున్నా…
ఉల్లి ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి… ఇక్కడి ప్రభుత్వాలు ఉల్లి ధరలను తగ్గించి ప్రజలకు అందిస్తున్నా ఉల్లి కొరత భారీగా ఉంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు ఉల్లి మీద దొంగలు పడ్డారు. దేశం నలుమూలలా ఉల్లి దొంగలు హడావుడి చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో 50 కేజీల ఉల్లిని దొంగలించారు ఇద్దరు దొంగలు. వివరాల్లోకి వెళితే… యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో గోల్‌ఘర్ లోని ఒక హోటల్ కోసం 50 కిలోల ఉల్లి తీసుకుని ఒక రిక్షా వాలా వెళ్తున్నాడు.
అతను హోటళ్లకు కూరగాయలను తరలిస్తూ ఉంటాడు… ఈ నేపధ్యంలోనే ఉల్లిని హోటల్ కి తరలిస్తూ ఉండగా… ఇద్దరు దుండగులు బండి మీద వచ్చి అతన్ని బెదిరించి ఉల్లిని తీసుకునిపోయారు. ఈ ఘటనలో రిక్షా వాలాకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఉల్లి విక్రేత ఫిరోజ్ అహ్మద్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా… అసలు తాము ఎప్పుడు ఇలాంటి కేసు వినలేదని… ఘటనపై విచారణ జరిపి బాధ్యులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. దీనితో ఆ ప్రాంతంలో ఉల్లి విక్రేతలు జాగ్రత్తపడుతున్నారు.