గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు.
ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు అస్పతి వడ్డే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీక్ష కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఈనెల 18న రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కింద పడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ అళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ అస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు.