తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నగారా మోగింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం రోజున ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే రోజున నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగా తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు. తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య, ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.