తెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం

-

ఓవైపు పగలంతా భానుడి భగభగలు.. సాయంత్రం మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు. రాష్ట్రంలో ఆదివారం ఇలా భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఇన్నాళ్లూ రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన నల్గొండ, సూర్యాపేట, ములుగు, జనగామ జిల్లాలు ఆదివారం వర్షపు చినుకులతో కాస్త చల్లబడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి.

అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వాజేడు, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలు, జనగామ జిల్లాకేంద్రం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. మరోవైపు వడదెబ్బ, పిడుగుపాటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజున నలుగురు చొప్పున మృతి చెందారు. కొన్ని జిల్లాల్లో సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news