రాష్ట్రంలో మద్యం, గంజాయి అమ్మించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని జనసేనాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైయస్ జగన్ లాంటి వ్యక్తి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేడని జనసేన పార్టీ అధినేత పవన్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో బుధవారం నిర్వహించిన ‘వారాహి జనభేరి’ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలపై జగన్ దాడులు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలని, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని అన్నారు.విద్యా, వైద్యం, సాగునీరే లక్ష్యంగా 2014 ఎన్నికల్లో కలిసి పని చేశామని తెలిపారు. మరోసారి రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ అందరం ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నామని అన్నారు. వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని, ఆ పార్టీ నేతలు ఇచ్చే 2000కి లొంగితే భవిష్యత్తు పాడు చేసుకున్న వాళ్ళమవుతామని అన్నారు.