గత ఏప్రిల్ నెలలో భూమిపై ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. ఏప్రిల్ నెల అత్యంత ఉష్ణమయ నెలగా నిలిచిపోయింది. ఆ నెలలో ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల తీవ్ర వేడి, వర్షాలు, వరదలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైందని పరిశోధకులు తెలిపారు.
ఎల్‌నినో, మానవచర్యలతో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల ఇలా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐరోపా సంఘానికి చెందిన వాతావరణ సంస్థ.. కోపర్‌నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ (సీ3ఎస్) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పుడమి సరాసరి ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌నినో వాతావరణ పోకడ గరిష్ఠ స్థాయికి చేరిందని సీ3ఎస్ తెలిపింది. ప్రస్తుతం అది తగ్గుముఖం పడుతోందని పేర్కొంది. పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల మహాసముద్రాల్లో పేరుకుపోయిన అదనపు శక్తి.. ప్రపంచ ఉష్ణోగ్రతలను కొత్త రికార్డుల వైపు నెడుతోందని సీ3ఎస్ పేర్కొంది.