దేశవాళీ క్రికెట్ ఆడటానికి అశ్రద్ధ వహిస్తున్నారని,రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్లో ప్రాంఛైజీల తరఫున ఆడటానికి ఆసక్తి చూపుతున్నారు అని ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో ఇషాన్ కిషన్,శ్రేయస్ అయ్యర్ ల పేర్లు ప్రకటించకుండా వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విషయం పై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు.సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను తప్పించడంలో తన ప్రమేయం లేదని జై షా వెల్లడించారు.
యువ క్రికెటర్లపై వేటు వేయడానికి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కారణం అని అన్నారు. చీఫ్ సెలక్టర్ ఆదేశాలను పాటించడమే తన విధి అని జై షా వెల్లడించారు. ”రాజ్యాంగాన్ని ఒకసారి పరిశీలించండి. నేను సెలక్షన్ కమిటికీ కేవలం కన్వీనర్ మాత్రమే. దేశవాళీ క్రికెట్ ఆడని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తప్పించింది అజిత్ అగార్కర్. వాళ్ల నిర్ణయాన్ని అమలు చేయడమే నా పని” అన్నారు.