తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. 4 సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడమే గాక మరో నాలుగు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు రెండోసారి విజయం సాధించారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి రుచి చూసిన నేతలు ఈసారి లోక్‌సభ అదృష్టం పరీక్షించుకున్నారు. వారంతా ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. మరి అసెంబ్లీకి నో ఎంట్రీ అన్న ప్రజలు పార్లమెంటుకు పంపిన నేతలెవరో చూద్దామా?
కరీంనగర్లో బండి సంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో 2.12లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో బండి సంజయ్‌కు ప్రజలు పట్టం కట్టారు. మరోవైపు ఇందూరు ఇలాకాలో ధర్మపురి అర్వింద్ మరోసారి కాషాయ జెండా ఎగురవేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది 25 ఏళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న మెదక్‌లో కాషాయ జెండా రెపరెపలాడించారు. మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లోపోటీ చేసిన ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో చేతిలో ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.