ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది.175 స్థానాల్లో పోటీ చేసిన కూటమి 164 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.ఇందులో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 స్థానాలు గెలవగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా గెలిచింది. ఇక భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.ఇండి కూటమి ఈసారి కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన వైసీపీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులందరూ ఓటమి పాలయ్యారు.కాగా పులివెందుల నియోజవకర్గంలో గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది.మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ సహా పలువురు కీలక నేతలంతా ఓడిపోయారు
కాంగ్రెస్ పార్టీ మరోసారి తీరని దెబ్బ తగిలింది. ముచ్చటగా మూడోసారి ఏపీలో ఏ ఒక్క స్థానంలో గెలువలేక పోయింది. వైఎస్ షర్మిలతోనైనా పార్టీ పరువు కాపాడుకోవచ్చని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి చుక్కెదురయ్యింది . ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా కాంగ్రెస్ వందకు పైగా స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఏ ఒక్క స్థానంలో విజయం సాధించలేకపోయింది.2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సీటును దక్కించుకోలేక పోయింది. 2024 ఎన్నికల్లో అవే ఫలితాలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు కంగుతింటున్నారు. ఇక కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్ షర్మిల సైతం ఓటమిపాలైంది.
వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు…..
పులివెందుల: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
బద్వేలు: దాసరి సుధ
పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రాలయం: వె.బాలనాగిరెడ్డి
ఆలూరు: బూసినే విరూపాక్షి
యర్రగొండపాలెం (ఎస్సీ): తాటిపత్రి చంద్రశేఖర్
అరకు(ఎస్టీ): రేగం మత్స్యలింగం
పాడేరు (ఎస్టీ): మత్స్యరాస విశ్వేశ్వరరాజు
రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
దర్శి : బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
వైసీపీ గెలిచిన ఎంపీ స్థానాలు…..
కడప-వైఎస్ అవినాష్ రెడ్డి
రాజంపేట-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
తిరుపతి(ఎస్సీ)-మద్దెల గురుమూర్తి
అరకు-తనూజరాణి