తమిళంలో ‘అరణ్మణై’ పేరుతో ఫ్రాంచైజీ చిత్రాల్ని రూపొందిస్తున్నారు సుందర్.సి. అవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్ మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన నాలుగో చిత్రమే ‘బాక్’. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ మూవీని ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదలై ఇక్కడా అలరించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్తో పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్స్టార్ వేదికగా జూన్ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.