ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులోని లేని వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు..టీడీపీ కి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరుకానున్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్ లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి. ఆ తర్వాతే మనమని తెలిపారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తుంచుకోవాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని.. ఆయన రాబోతున్నట్టు తెలిపారు.