సంకీర్ణ ప్రభుత్వాల వల్ల నష్టమేమీ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. పైగా ప్రధానమంత్రితో పాటు బీజేపీ మరింత జవాబుదారీతనం, బాధ్యతతో వ్యవహరించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇక నుంచి మోదీ తనకు నచ్చినట్లు చేసే విధానం ఇకపై ఉండదని.. సొంతంగా మెజార్టీ లేని నేపథ్యంలో సంకీర్ణ పక్షాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఇండియా కూటమి బలమైన, సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని థరూర్ అన్నారు. ఎన్నికలకు ముందే ఏర్పడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో కావాల్సిన సంఖ్యాబలం లభించింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారి హక్కును కాదనే ప్రశ్నే లేదని తెలిపారు. తాజా పరిస్థితుల నుంచి నాటకీయ పరిణామాలను సృష్టించడంలో అర్థం లేదని ఇండియా కూటమి చాలా స్పష్టంగా నిర్ణయించిందని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండన్న థరూర్.. ఇండియా కూటమి బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఉంటామని స్పష్టం చేశారు. అయితే సొంతంగా మెజార్టీ లేని నేపథ్యంలో సంకీర్ణ పక్షాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.