తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈరోజు (జూన్ 11వ తేదీ) కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశముందని చెప్పారు.
రేపు (జూన్ 12వ తేదీ) కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ రెండు రోజులపాటు ‘పసుపు’ రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.