ఏపీ మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి, ఏయే వర్గాలకు ఎంత ప్రాధాన్యమివ్వాలి.. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని.. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు కొలిక్కివచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు కేబినెట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో చేరటం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశముంది.
పవన్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలిసింది. బీజేపీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే విజయంపై ధీమాతో ఉన్న చంద్రబాబు ఎన్నికల ఫలితాలు రాక ముందే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఫలితాలొచ్చాక దాన్ని మరింత ముమ్మరం చేశారు. భారీ సంఖ్యలో 164 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు గెలుపొందటంతో.. ఆశావహుల సంఖ్య అంచనాలకు మించి ఉంది.