ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలను విద్యార్థులు రావట్లేదన్న కారణంగా మూసివేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రతి గ్రామం, తండాకు విద్యను అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని వెల్లడించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.
‘ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకుండా ఉండేందుకే మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నాం. 11 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. పాఠశాల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభించాం. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ‘ఆచార్య జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మధ్యాహ్న భోజనం నుంచి ఏకరూప దుస్తుల వరకు ప్రతి బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను కూడా ఆ సంఘాలే చూస్తాయి. అందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నాం. ‘ అని రేవంత్ అన్నారు.