కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పంచాయితీ కాస్త దిల్లీకి చేరింది. ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమయ్యాయి. కర్ణాటక సీఎం స్థానాన్ని లింగాయతలకు ఇవ్వాలని కొందరు మఠాధిపతులు డిమాండ్ చేస్తుండగా.. డీకే శివకుమార్‌కు కేటాయించాలని విశ్వ ఒక్కలిగర పీఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి నేరుగా సిద్ధరామయ్యకే సూచించారు. ఇప్పటి వరకు దళితులకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదని, ఈసారి వారికే పదవి ఇవ్వాలని మరో వాదనను తెరపైకి వచ్చింది.
మరోవైపు గ్యారంటీలతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఇంధన ధరల పెంపును ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బీజేపీ, దళ్ ప్రభుత్వంపై పోరును కొనసాగిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి మార్పు, ఉప ముఖ్యమంత్రుల సంఖ్య పెంపు విమర్శలు పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఈ గొడవ కాస్త పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లగా.. పార్టీ సీనియర్ నాయకులు సోనియా, రాహుల్‌లతో చర్చించి, వివాదాన్ని పరిష్కరిస్తానని డీకే శివకుమార్‌కు ఖర్గే భరోసా ఇచ్చారు.