ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్రలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ఆదేశించారు. మృతుడిని లలిత్ బగర్తిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ జరిగింది.. తాళధ్వజ రథాన్ని లాగుతున్న సమయంలో లలిత్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయన్ను వెనక ఉన్న వారు తొక్కేశారు. పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే భక్తుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడం వల్ల ఉక్కపోత వల్ల 300 మంది స్పృహ తప్పారు. చికిత్స అనంతరం వారంతా కోలుకున్నారు.
మరోవైపు భక్తకోటి జయజయధ్వానాల నడుమ పూరీ జగన్నాథ రథయాత్ర తొలిరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయ క్రతువులన్నీ పూర్తైన తర్వాత జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథాలపై గుండిచాదేవి మందిరానికి బయలుదేరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భక్త కోటితో కలిసి రథాలను లాగారు.