వీధి కుక్కల నియంత్రణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కుక్కల నియంత్రణకు ఏం చేశారన్న విషయమై.. గణాంకాలు కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారన్నదే అవసరమని స్పష్టం చేసింది. ఒకవైపు పిల్లలు చనిపోతుంటే.. మీరేమో ‘కౌంటర్ దాఖలు చేశాం.. జూబ్లీహిల్స్లో 350, బంజారాహిల్స్లో 250 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశాం.. అదనపు కౌంటరు దాఖలు చేస్తాం..’ అని గడువు తీసుకుంటూ వెళ్లడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్ చేయడం లేదని, ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య ప్రజాప్రయోజన వ్యాజ్యం వేేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కుక్కల దాడులు జరుగుతోంది ఖరీదైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి కాలనీల్లో కాదని, పేదలు నివసిస్తున్న మురికివాడలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించింది. ఈ వ్యవహారాన్ని ఒక కేసుగా చూడకుండా మానవీయ కోణంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. నిపుణులతో కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.