యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించి జూన్ 2న నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. డిసెంబర్ 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని వెల్లడించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంకేతిక విద్యలో మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
ఏటా దాదాపు లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టాలతో కళాశాలల నుంచి బయటికి వస్తున్నారని.. వాళ్లలో కొందరికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని రేవంత్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఇంజినీరింగ్ విద్యార్థుల్లో లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం రూపొందించిన పాఠ్య ప్రణాళికలే ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యలో భోదిస్తున్నారని, విద్యార్థులు చదువుతున్న పాఠాలకు, మార్కెట్లో కావాల్సిన నైపుణ్యానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉందన్నారు. ప్రతి రంగంలో కృత్రిమ మేథ ప్రభావం కనిపిస్తోందని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి కృత్రిమ మేథ కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే 200 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.