తిరుమల శ్రీవారి దర్శనార్థం అమరావతి రైతులు పాదయాత్రగా తరలివచ్చారు. అలిపిరి నడకమార్గం నుంచి తిరుమలకు బయలు దేరారు. గత నెల 24వ తేదీన అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు. 30 మంది రైతులు 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్న రైతులు.. ఆదివారం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు.
మరోవైపు సోమవారం రోజున అమరావతి రైతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను విజయవంతంగా సాగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారంతా తిరుమలకు చేరుకున్నారు.
మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటుగా అమరావతిలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో పనులు వేగం పుంజుకున్నాయి.