రేషన్ కార్డులు లేని రైతుల వద్దకే అధికారులు వెళ్లనున్నారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు వచ్చి పరిశీలిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయని, నకిలీ పట్టా పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకున్న వారిని గుర్తించామని చెప్పారు. రూ. లక్ష జీతం ఉన్నవారికి రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు.
కాగా, ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గురువారం (జులై 18వ తేదీ) న తొలి విడతగా లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం 8వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబం 2 లక్షల మాఫీకి అర్హులేనని తెలిపారు. రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.