తెలంగాణ బీజేపీకి దళపతి ఎంపికపై కసరత్తు షురూ అయింది. అధ్యక్ష రేసులో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. ఆయనకు పోటీగా ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించాలని పార్టీ పెద్దలు భావిస్తుంటే.. బంగారు లక్ష్మణ్ తరువాత దళితులకు ఈ పదవి దక్కలేదు కాబట్టి…. ఈ సారి ఎస్సీ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని ఆ వర్గం నేతలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.
ఒకవేళ బీసీకి అవకాశం ఇస్తే ఈటల రాజేందర్, ధర్మపురి ఆర్వింద్‌లో ఎవ్వరో ఒక్కరు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు, హైదరాబాద్ నుంచి కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకి బాధ్యతలు అప్పగిస్తే… సీఎం రేవంత్ రెడ్డికి ధీటుగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పార్టీలో పలువురు నేతలు అధిష్ఠానం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. పార్టీ సారథి ఎవరవుతారో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.