భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్ద వాగు ప్రాజెక్టుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌గేట్లలో ఒకటి పని చేయకపోవడంతో గురువారం రాత్రి 7.45 గంటల సమయంలో కట్ట తెగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఈ ఉమ్మడి ప్రాజెక్టుకు గండి పడటంతో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా… ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది.
పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గండి పూడ్చేందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరుల శాఖ డీఈ కృష్ణ తెలిపారు. మరోవైపు ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో పలు చెరువులు తెగడంతో పెద్దవాగుకు భారీగా వరదనీరు చేరడంతో రెండుగేట్ల నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇన్‌ఫ్లో అనూహ్యంగా 70 వేల క్యూసెక్కులకు చేరింది. దాంతో మధ్యాహ్నం 3గంటల నుంచి కట్ట పైనుంచి వరద ప్రవహించగా.. ఏక్షణమైనా ఆనకట్టకు గండిపడుతుందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్లే రాత్రి 7.45 గంటలకు గండి పడింది.