మరో నాలుగు రోజుల్లో పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 క్రీడలు జరగనున్నాయి. జులై 26వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇప్పటికే ఒలింపిక్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే క్రీడా గ్రామానికి అథ్లెట్లు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం చేస్తోన్న కారణంగా ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలికేది లేదని పోర్టెస్ వ్యాఖ్యానించడం క్రీడా వర్గాల్లో ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది.
‘‘పారిస్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ ప్రతినిధులు, అథ్లెట్లకు మేం స్వాగతం చెప్పం. ఈ క్రీడల్లో ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై నిషేధం విధించేలా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఫ్రాన్స్ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి. రష్యాపై చేసిన విధంగానే చర్యలు తీసుకోవాలి. ద్వంద్వ వైఖరికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని పోర్టెస్ తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలపగా.. మరికొందరు తీవ్రంగా విమర్శలు చేశారు.