కాసేపట్లో శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ముందుంచనున్నారు. ఇవాళ్టి అజెండాలో బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రభుత్వం తీర్మానం పెట్టనుంది. సభ్యులంతా ఈ తీర్మానంపై తమ అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపనున్నారు.
అయితే ఇవాళ్టి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. సభలో ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యపై చర్చించాలని ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల ఆందోళనలపై వాయిదా తీర్మానం ఇచ్చిన గులాబీ దళం.. ప్రభుత్వ అణిచివేత వైఖరిపై చర్చ జరపాలని అందులో కోరింది.
ఇదే కాకుండా.. అక్రమ అరెస్టులు, హామీలు అమల్లో వైఫల్యం, రుణమాఫీ, పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలు, నకిలీ మద్యం వ్యవహారం, ఆర్టీసీ విలీనం, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విడుదల, పెన్షన్లు, శాంతి భద్రతలు, విదేశీ విద్యానిధి, తదితర అంశాలను ఉభయసభల్లో లేవనెత్తాలని , ప్రధానంగా ఏకకాలంలో రుణమాఫీ అనేది ఒక మోసమని దీనిని సభలో ఎండగట్టాలని నిర్ణయించారు.