ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. వాటిపై సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తాము అడిగింది ఒకటైతే అధికారులు చెబుతోంది మరోలా ఉంటోందని అంటున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చకు తెచ్చారు.
ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర వివరాలు లేకుండా కేవలం అవును కాదు అంటూ పొడిపొడి సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో అధికారులు సరైన వివరాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.