ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు సాంకేతిక, ఇతర సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి త్రుటిలో ప్రమాదం తప్పించుకుంటుండగా.. మరికొన్ని సార్లు ప్రమాదాన్ని పసిగట్టలేక కుప్పకూలుతున్నాయి. తాజాగా నేపాల్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18మంది దుర్మరణం చెందారు. ఒకరు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఇవాళ ఉదయం రాజధాని నగరం కాఠ్‌మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వేపై నుంచి జారి క్రాష్ అయిందని అధికారులు తెలిపారు. విమానంలో మంటలు చెలరేగడం.. అందులో నుంచి పొగలు వస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఘటనాస్థలం వద్ద సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మొత్తం 18 మంది చనిపోయినట్లు నిర్ధారించిన అధికారులు.. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. పైలట్ మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.