ఆరునూరైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. మాట తప్పినందుకు మిమ్మల్ని అభినందించాలంటూ ఎద్దేవా చేశారు. 420 హామీలు తుంగలో తొక్కినందుకు అభినందించడం కాదు.. అభిశంసించాలని అని అన్నారు. రీకాల్ వ్యవస్థ లేదు కనుక ఐదేళ్లూ భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సమయంలో కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.14.65 లక్షల కోట్లకు ఆదాయం పెంచాం. తలసరి ఆదాయంలో మన రాష్ట్రమే నంబర్‌వన్. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తలసరి ఆదాయంతో పోటీపడుతున్నాం. రైతు రుణమాఫీ కోసం మీరు పడుతున్న కష్టాలు మాకు తెలుసు. నిధులు సమకూర్చుకోవడం ఎంత కష్టమో మాకు తెలుసు. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేస్తామనడం సరికాదు. కరోనా సమయంలో రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగవద్దని అనుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సాయం ఆపకూడదని నిధులు మళ్లించి ఉండవచ్చు. ప్రస్తుతం కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు లేవు. మేం చేసిన అప్పులు చెప్పినవాళ్లు.. మేం ఇచ్చిన ఆస్తుల గురించీ చెప్పాలి.” అని కేటీఆర్ అన్నారు.