ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నూతన మద్యం పాలసీ పై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 01 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామన్నారు. మద్యం ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవిధంగా చూస్తామన్నారు. 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు.
గత ప్రభుత్వం నాసిరకం మందును అధిక ధరలకు విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము నాణ్యత తో కూడిన లిక్కర్ ని అందిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ.. శాసనసభలో తీర్మాణం చేసింది. మరోవైపు మద్యం కుంభకోణం పై సీఎం చంద్రబాబు కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్నారు. ఐదేళ్లలో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. భయంకరమైన స్కామ్ అన్నారు.