కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) ప్రకటించింది. శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పని చేస్తాయని స్పష్టం చేసింది.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన నిరసన ప్రాంగణంపై అల్లరి మూకలు చేసిన దాడికి నిరసనగా ఆందోళన చేపడుతున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో పేర్కొంది. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారని.. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్‌ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రకటనలో పేర్కొంది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ.. కోల్ కతా డాక్టర్ ఘటనపై మృతురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్ కు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది.