ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న ఐదు పథకాల పేర్లను మార్చింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చడం జరిగింది. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా మార్చారు. జగనన్న గోరు ముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. మనబడి నాడు నేడు పథకం పేరును మనబడి మన భవిష్యత్తు అని మార్చారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటుగా స్వేచ్ఛ పథకం పేరును బాలిక రక్షగా, జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలుగా మార్చారు.
ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మార్చిన అనేక పథకాల పేర్లని మారుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ప్రారంభించిన పథకాలు పేర్లను కూడా మార్చారు. అమ్మ ఒడిని తల్లి కి వందనంగా మార్చారు. ఈ పథకం కింద పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులు ఖాతాల్లో ఏటా రూ.15000 చొప్పున గత వైసీపీ ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది. ఈ మొత్తంలో టిఎంఎఫ్ ఎస్ఎంఎఫ్ పేరిట సుమారుగా 2000 వరకు కోత విధించారు.
అయితే ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి రూ. 15000 చొప్పున వేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. దీనికి తల్లికి వందనం అని పేరు పెట్టింది. తాజాగా అమ్మ ఒడి పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.