హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. హైడ్రా అనేది ఓ భయానకమైన పేరులా ఉందన్నారు. హైడ్రా ఓ డ్రాగన్ గా మారవద్దని.. ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. నాగార్జున ఓ పెద్ద పర్సన్ అని.. ఆయన నిజంగానే తప్పు చేసి ఉంటే కోర్టు డిసైడ్ చేస్తుందన్నారు. ఇప్పటివరకు నాగర్జున, దానం నాగేందర్ లాండ్ లు మాత్రమే కూల్చివేత జరిగిందని అన్నారు.
వీటి గురించి పెద్దపెద్ద వాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు తేల్చుకుంటారు కానీ.. చిన్నవాళ్లు అనేకమంది భయపడుతున్నారని తెలిపారు. పేదవారి ఇండ్లని కూల్చేస్తే వారు రోడ్డున పడతారని.. ఒకసారి వారి గురించి ఆలోచించాలన్నారు. ధరణి పేరుతో గతంలో అనేక వేల ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందన్నారు కూణంనేని. వాటన్నింటిపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు జరపాలన్నారు. ఇక మధ్యతరగతి కుటుంబాలు అనేకమంది అపార్ట్మెంట్లలో లోన్ లు పెట్టుకుని కొనుక్కున్నారని.. వాళ్లకు పరిహారం ఇవ్వాలన్నారు. రంగనాథ్ కి ఏదైనా పని అప్పగిస్తే చాలా స్పీడ్ గా పనులు చేస్తారని.. హైడ్రా కింద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.