గత కొద్ది రోజులుగా గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్ల పరిశీలనలో బిజీగా ఉన్నారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నగరంలోని పలు చెరువులను సందర్శిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉప్పల్ నల్లచెరువును పరిశీలించడానికి వెళ్లిన మేయర్ గద్వాల విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది.
మేయర్ విజయలక్ష్మి పై ఉప్పల్ వాసులు తిరగబడ్డారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ నల్లచెరువును పరిశీలించడానికి వెళ్లిన ఆమెని స్థానికులు అడ్డుకున్నారు. ఉప్పల్ లో ఏం పనులు జరగడం లేదని, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు ప్రశ్నించారు.
దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో తమపై దాడి చేశారని ఆరోపిస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.