ఆంధ్రప్రదేశ్ లో దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల విజయవాడ ను వరదలు ముంచెత్తాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుడమేరు వరద తగ్గుముఖం పడుతుందనుకున్న లోపే మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.
దీంతో చంద్రబాబు అధికారులను మళ్లీ అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నట్టు తెలిపారు. నిత్యవసర పంపిణీ, పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని వెల్లడించారు. కానీ తెలంగాణలో వర్షాలు కురవడం, ఏపీలో కూడా మళ్లీ వర్షాలు కురవడంతో వరద తీవ్రవ వచ్చే అవకాశం ఉందని.. దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు.