తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసారు. సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు. చదువే కాదు.. క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టను పెంచేది క్రీడాకారులేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఏషియన్ గేమ్స్ సహా క్రీడలు నిర్వహించారు. అప్పుడు హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కానీ తెలంగాణ వచ్చిన తరువాత క్రీడలను నిర్లక్ష్యం చేశారని.. యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతుంటే చాలా బాధపడ్డామని తెలిపారు. ప్రస్తుతం క్రీడలకు హైదరాబాద్ హబ్ లా మారేవిధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. క్రికెటర్ సిరాజ్ కు ఉద్యోగం ఇచ్చి.. ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.