తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఇప్పటికే డిజిటల్ కార్డుల్లో ఇంటి యజమానిగా మహిళనే చేర్చుతుంది. రిజర్వేషన్లలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుంది. తాజాగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇవాళ మంత్రుల ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. డీపీఆర్ సిద్దం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధి విధానాలపై చర్చించారు. మొదటి విడతలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్, మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్ ఎంపిక చేశారు.