ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి కొనసాగించాలి అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన అనేది ఇప్పుడు విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తూ జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు చంద్రబాబు.
సోమవారం అనంతపురంలో జరిగిన యాత్రలో చంద్రబాబు నాయుడు జోలెపట్టి విరాళాలు సేకరించగా, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో జేసీ మాట్లాడుతూ, ఏపీని మూడు రాష్ట్రాలుగా విడగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కుల ద్వేషాన్ని, ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని జేసి తీవ్ర ఆరోపణలు చేసారు.
రాష్ట్రానికి రాజధాని అంటే, అసెంబ్లీ, సెక్రటేరియెట్, హైకోర్టు ఒకే చోట ఉండాలని ఈ సందర్భంగా జేసి స్పష్టం చేసారు. హైదరాబాద్‌లో సచివాలయం, శాసనసభ ఎలా ఉన్నాయో, అమరావతిలోనూ అలాగే ఉండాలన్నారు. కేవలం కులాన్ని, మతాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.