తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికావొస్తున్నది. సంవత్సర పాలనలో సాధించింది ఏమీలేదు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయలేదు. రూ. 2 లక్షల చొప్పున రూ. 31 వేల కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ. 17 వేల కోట్లతో కాంగ్రెస్ సర్కారు సరిపెట్టింది. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులు చేసిన అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. రైతు భరోసా కింద సాగుచేసే రైతులకు రూ. 15 వేల చొప్పున ఇస్తామన్నరు.. కాంగ్రెస్ హామీ నేరవేర్చకపోవడంతో రాష్ట్రంలో రైతులు మోసపోయారు. రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా రైతులు భరోసా కోల్పోయారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే సుమారు 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. పేపర్ లీకేజీలతో యువత కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బీఆర్ఎస్ ను ఓడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాది వ్యవధిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీతో ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ అంటే .. ప్రజలను వంచించి మోసం చేయడమే గ్యారంటీ. అవినీతి, కుంభకోణాలకు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ. వంశపారపర్య రాజకీయాలకు, కుటుంబ పాలనకు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.