వికారాబాద్ జిల్లా లగచర్ల లో ప్రభుత్వ అధికారులపై రైతుల మాటున దాడి చేసిన దోషులు, దాడికి ప్రేరేపించిన కుట్రదారులపై కఠిన చర్యలకు ఆదేశించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కోరారు. జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో జేఏసీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్ కి వివరించారు.
రైతుల మాటున కొందరూ దుండగులు అధికారులపై దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని గవర్నర్ దృష్టికి తీసుకెల్లారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొందని తెలిపారు. రైతుల మాటున అధికారులపై దాడికి పాల్పడిన దుండగులపై దాడికి ప్రేరేపించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం వారు సురక్షిత వాతావరణంలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించేలా సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.