తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలిచే పరిస్థితి లేదని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఆయన మళ్లీ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.
హామీలపై ఎక్కడ సభ పెట్టినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులను వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నవి ప్రజా విజయోత్సవాలు కాదని.. వంచనోత్సవాలు అని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ఏ మొహంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా దెబ్బతింటుందో ఇందుకు రేవంత్ రెడ్డి ఉదాహరణ అన్నారు.