బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఫిరాయింపులకు పాల్పడుతోందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ సకల జనుల సర్వే అంటే.. కాంగ్రెస్ సమగ్ర కులగణన అంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను జైలుకు పంపుతామన్నారని.. ఏమైందని ప్రశ్నించారు. అప్పులు తేవడంలో బీఆర్ఎస్ పంథాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పయణిస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వ మూసీ ప్రణాళికనే.. ప్రస్తుత సర్కార్ అమలు చేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందన్నారు. రెండు పార్టీల నాటకాలను బట్టబయలు చేస్తామన్నారు. అక్రమ నిర్మాణం పేరుతో అయ్యప్ప సొసైటీ కట్టడాలను కేసీఆర్ ప్రభుత్వం నేరుగా కూల్చేసింది. ఆ తరువాత అన్నీ సక్రమం అయిపోయాయి. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చుతామంటున్నారు. రాహుల్ గాంధీకి ఎడమకన్ను కేసీఆర్ అయితే.. కుడి కన్న రేవంత్ రెడ్డి అన్నారు NVSS ప్రభాకర్. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను తిరస్కరించిన సీఎం.. కాళేశ్వరం కొట్టుకుపోవడానికి కారణమైన గుత్తేదారు విరాళాలు ఎందుకు తిరిగి ఇవ్వలేదని ప్రశ్నించారు.