ఇవాళ తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే శాసన మండలి సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం దగ్గర మనం 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం. దాని ముందే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అని ఉంది. దానిని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా మార్చితే సంపూర్ణంగా ఉంటుందని తన అభిప్రాయమని చెప్పారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఎందుకంటే ఆ తల్లిని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ పేరు పెడితే బాగుంటుందని శాసనమండలిలో మంత్రి వర్యులకు చెప్పారు తీన్మార్ మల్లన్న.
ఇవాళ శాసన మండలి సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవశ్యకత గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ జాతి భావనకు జీవం పోసిందని, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా ఉందన్నారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈనెల 16న సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని వెల్లడించారు.